Rain in Medak District: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వట్ పల్లి, కోహిర్ మండలాల్లో వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడింది.
Read Also: Bomb In Flight: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. చివరకు..
సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది. అరగంట వ్యవధిలో సంగారెడ్డి పట్టణం తడిసి ముద్దయింది. రోడ్లపై భారీగా పారుతున్న వరద నీటితో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వర్షపు నీరు భారీగా నిలిచింది. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి దుమారానికి పలు చోట్లు చెట్ల కొమ్మలు విరిగిపడగా.. బారికేడ్లు నెలకొరిగాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరిపొలాలు కోసి ధాన్యాన్ని కుప్పగా పోసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి.