ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి పులి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లాలో తాజాగా 12.3 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 14.1, మంచిర్యాల జిల్లా 14.1, నిర్మల్ జిల్లా లో 14.2 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో చలితీవ్రత అధికమవడంతో.. తెల్లవారు జామున పనులు చేసుకునేవారు చలిని తట్టుకోలేకపోతున్నారు. పేపర్‌బాయి మొదలుకొని మున్సిపల్ కార్మికులు, ఇతర కూలీలు ఉదయాన్నే విధులు నిర్వహిస్తుంటారు. మంచుతో ఉండడంతో తమ పనులు చేసుకోవడానికి వారు అవస్థలు పడుతున్నారు. అలాగే కూలీనాలి చేసుకునే కార్మికులు జీవనోపాధి కోసం రాత్రిళ్లు వాచ్‌మెన్ విధులు నిర్వహించే వారు మంట వేసుకుంటున్నారు.
Also read :Goods Train Derailed: రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు.. పలు రైళ్లు రద్దు..
ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంటే చలిమంటలు కాసుకుంటున్నారు. చీకటి పడగానే భారీగా మంచు కురుస్తుంది. వాహనాలు సైతం మంచులో తడిసి ముద్దవుతున్నాయి.. చలికి తోడు చల్లటి ఇదురుగాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతతో వైరల్ ఫీవర్ భారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇక సాయంత్రం 6 గంటలు దాటిందంటే చలిపులిలా విరుచుకుపడుతోంది. చలి దాటికి జనాలు గజగజ వణుకుతున్నారు. చలి బారినుంచి రక్షించుకునేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించి బయటకు వస్తున్నారు.