Vishnuvardhan Reddy: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ప్రకటించారు.. ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో ఉంటూ.. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానన్న ఆయన.. స్థానికుడైన తనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాను అన్నారు.. టిక్కెట్ కోసంఅడిగే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.. హిందూపురం పోటీ చేయాలన్న ఆ ఆలోచనను.. నా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. అయితే, నేను పోటీ చేసే విషయంపై పార్టీ అధిష్టానం ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే, పొత్తులు కుదరకపోయినా.. మీరు బీజేపీ అభ్యర్థిగా.. ఒంటరిగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ.. మా అభిప్రాయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లాం.. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని వెల్లడించారు విష్ణువర్ధన్‌రెడ్డి.
Read Also: Maratha Reservation Protest: మహారాష్ట్రలో రిజర్వేషన్ మంటలు.. బస్సును తగలబెట్టిన నిరసనకారులు
కాగా, ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికలు జరగనుండగా.. టీడీపీ-జనసేన పార్టీలకు చెందిన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం విదితమే.. బీజేపీతో పొత్తు కోసం ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తుండగా.. బీజేపీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.. ఈ నేపథ్యంలో.. ఓ ముందడుగు వేసిన టీడీపీ-జనసేన.. తొలి జాబితాను విడుదల చేయడంతో బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుందనే చర్చ సాగుతోంది.