గొర్రెలు, మేకలను కాసేందుకు గొర్రెల కాపరులను పెట్టుకుంటారు. అయితే గొర్రెల కాపరి యజమానికి తెలియకుండ ఓ మేకను అమ్ముకుంటే ఏం చేస్తారు. తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేస్తారు. ఇదెక్కడి అరాచకం అనుకుంటున్నారా. అవును మీరు చదువుతున్నది నిజమే. తాము పనిలోపెట్టుకున్న కుర్రాడు మేకను ఎత్తుకుపోయాడనే అనుమానంతో అతడిని, అతడి స్నేహితుడిని ఓ యజమాని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేసాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది.
Read Also: Road Accident: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
వివరాల్లోకి వెళ్తే.. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతడి భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్ అంగడిబజార్ ప్రాంతంలో ఉంటున్నారు. వీరు పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి మేకలను పెంచుతున్నారు. అయితే తేజ(19) అనే యువకుడు వీరి ఇంట్లోనే ఉంటూ పశువుల కాపరిగా చేస్తున్నాడు. 20 రోజుల క్రితం ఓ మేక, ఇనుప రాడ్డు కనిపించకుండా పోయింది. దీంతో తన దగ్గర కాపరిగా చేసే తేజతో పాటు అతడి స్నేహితుడు చిలుముల కిరణ్(30)పై యజమానికి అనుమానం వచ్చింది. దీంతో వారిని శుక్రవారం షెడ్డుకు పిలిపించాడు. ఆ తరువాత వారిని కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీశాడు. ఆపై తల కింద నేలపై నిప్పు పెట్టి చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో వారికి పొగతో ఊపిరాడక నానా యాతన అనుభవించారు. ఆ తరువాత వారిద్దరినీ విడిచిపెట్టారు. అయితే దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కిరణ్ చిన్నమ్మ సరితకు తెలియడంతో ఆమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై యజమాని, కుటుంబ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.