హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావును తెలంగాణ సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో టికెట్ల వివాదం నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో.. జగన్‌మోహన్‌ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. జగన్‌మోహన్‌తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అరెస్ట్ చేసి విచారించింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రెండేళ్లలో 170 కోట్ల రూపాయలు హెచ్‌సీఏలో గోల్‌మాల్ జరిగినట్లు సీఐడీ గుర్తించింది. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. హెచ్‌సీఏ సభ్యులు ప్లేయర్స్ తల్లిదండ్రులు నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. హెచ్‌సీఏలో చెక్ పవర్‌ను దుర్వినియోగం చేసినట్లు తేలింది. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో గోల్‌మాల్ జరిగిందని సీఐడీ పేర్కొంది. ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కాంప్లెమెంట్రీ పాస్‌లను సైతం బ్లాక్‌లో అమ్ముకొని నిందితులు సొమ్ము చేసుకున్నారు. క్రీడాకారుల కోసం ఉపయోగించాల్సిన కాంప్లెమెంటరీ పాస్‌లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తేలింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో యాజమాన్యం స్టేట్మెంట్‌ను సీఐడీ రికార్డ్ చేసింది.
Also Read: HCA: మాజీ మంత్రి సంతకం ఫోర్జరీ, వందల కోట్లు దోపిడీ.. జగన్మోహన్‌రావు అక్రమాల చిట్టా పెద్దదే!
ఐపీఎల్ 2025 టికెట్ల కోసం జగన్‌మోహన్ రావు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌హెచ్,హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొనడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సీఐడీని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్‌ఆర్‌హెచ్, టీసీఏ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఆర్థిక అక్రమాలు, పత్రాల ఫోర్జరీ, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు, నిధుల మల్లింపు విడుదల వంటి ప్రాథమిక ఆధారాలు సీఐడీ సేకరించింది. నివేదిక ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసి జగన్‌మోహన్ రావును అరెస్ట్ చేసింది.