Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో హవాలా మనీ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. వేల కోట్లు చేతులుమారుతున్నాయి.. ఎక్కడికక్కడ తనిఖీల్లో కోట్లాది రూపాయలు పట్టుపడుతున్నాయి.. ఇప్పటికే వందల కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. తాజాగా, హైదరాబాద్ శివారు అప్పా జంక్షన్ వద్ద పట్టుబడిన 7.4 కోట్ల రూపాయల నగదు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు 10 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మంకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సమీప బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పా జంక్షన్ వద్ద పట్టుబడిన నగదును.. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పరిధిలో ఓ విద్యాసంస్థల ఛైర్మన్‌కు చెందిన ఫాంహౌస్ నుంచి తరలించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఫామ్‌హౌస్‌తో పాటు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక పత్రాలతో పాటు లాకర్ కీలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రధాన పార్టీ నేత కోసం ఈ నగదును తీసుకెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు.
Read Also: Delhi Air Pollution: ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి.. నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
మరోవైపు..పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డికి చెందిన Av ఇన్ఫో ప్రైడ్‌లో పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో నోట్లకట్టలు, చీరలు దొరికాయి. అయితే అధికారుల వైఖరికి నిరసనగా AV ఇన్ఫో ప్రైడ్ A207 ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ బైఠాయించారు.అధికారులు ఆలస్యంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి సంబంధించిన డబ్బుల కట్టలు మాయమయ్యాయని ఆరోపించారు జక్కా. మరోవైపు, శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.625 కోట్లను దాటింది. అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు 625 కోట్లకు పైగా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గడచిన 24 గంటల్లో పట్టుబడిన మొత్తం రూ.22.46 కోట్లకు పైగా ఉంది.