కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి.. మళ్ళీ ప్రజలను మోసం చేయొద్దు అని సూచించారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారు.. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో మీరే అధికారంలోకి వచ్చారు. కానీ అప్పుడు ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదని లేఖలో ప్రస్తావించారు. 2023లో కూడా తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.. ఆ తర్వాత అన్ని హామీలను విస్మరించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారు.. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అనేకసార్లు మాటతప్పిన మీరు, మళ్ళీ ఏ నైతిక ధైర్యంతో మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదు.. అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా? ఒక్కదానినైనా అమలు చేశారా? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? అని ప్రశ్నించారు.
Supreme court: యూపీ మదర్సా చట్టం కేసులో కీలక తీర్పు
“గత ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల పేరుతో మహిళలు, రైతులు, పేదలకు ఇచ్చిన హామీలే కాకుండా మానిఫెస్టోలో కూడా అనేక రకాలైన హామీలను గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మాది గ్యారెంటీ అని మీరు, మీ సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా ప్రకటించారు. మాదే గ్యారెంటీ అని, ఇదే వారంటీ అని మీరు ట్వీట్లు కూడా చేశారు”అని పేర్కొన్నారు. “మీ మాటలు నమ్మి, మీపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. రాష్ట్రంలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే సందర్భంగా కూడా ఆరు హామీలకు చట్టబద్ధత కల్పించే పత్రంపై మీ సమక్షంలోనే సంతకాలు కూడా చేశారు. వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుంది. కానీ మీరిచ్చిన హామీలేవి తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని” లేఖలో తెలిపారు.
Hema Malini: బీజేపీ మధుర అభ్యర్థి హేమమాలిని ఆస్తులెంతో తెలుసా..?
బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని.. పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. “రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్ లోని 13వ పాయింట్ కింద ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే.. ఆ వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం చేస్తామని ఈసారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మీరు ఈ మ్యానిఫెస్టోను రూపొందించి విడుదల చేశారో లేదో తెలంగాణలో అందుకు భిన్నంగా జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. అలాంటి మీరు నైతికత గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు” అని విమర్శించారు. “మేనిఫెస్టోలో చెప్పిన నీతులకు, మీరు అధికారంలో ఉండి చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదు. దీంతో మీ మేనిఫేస్టోకు ఏ మాత్రం విలువ లేదని తేటతెల్లమైపోయింది. అయినా సరే, మీరు మేనిఫెస్టో విడుదల చేయడానికి తెలంగాణకు రావడం అత్యంత దురదృష్టకరం. ప్రజలను ఎన్నిసార్లైనా సరే మోసం చేసి గెలవవచ్చు అనే మీ మొండి ధైర్యానికి నిజంగా ఆశ్చర్యం కలుగుతున్నది” అని లేఖలో ప్రస్తావించారు.