నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడేవారని.. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు. తాను అసెంబ్లీలో ఒక ప్రశ్న వేస్తే మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారని.. రూ.5 లక్షల ఋణానికి మాత్రమే వడ్డీ లేకుండా ఇస్తున్నాం అని ఆమె చెప్పినట్లు తెలిపారు. కానీ నిన్న మీటింగ్ లో రూ.21 వేల కోట్లకు వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారన్నారు. రూ. 5 లక్షల వరకు మాత్రమే వడ్డీ లేని ఋణం ఇస్తూ…రూ.10 లక్షల ఋణాలకి కూడా వడ్డీ లేకుండా ఇస్తున్నాం అని మీటింగ్ లో చెప్పారని.. రూ. 21 వేల కోట్లకి ఎక్కడ వడ్డీ లేకుండా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
“పచ్చి అబద్ధాలు చెప్పి మహిళలను మోసం చేస్తున్నారు. అందుకే అబద్దానికి అంగిలాగు వేస్తే రేవంత్ రెడ్డి లాగా ఉంటారు అంటున్నాను. గతంలో ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నానని నా మీద కేస్ పెట్టారు. ఇప్పుడు అబద్ధాల రేవంత్ రెడ్డి అంటే ఇంకో కేస్ పెడతారేమో. ఇలా ఐదు అబద్ధాలు మాట్లాడారు. బట్టలు కుట్టడానికి గత ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చారు. మేము 75 రూపాయలు ఇస్తున్నాం అన్నారు. ఇక్కడ రెండు అబద్ధాలు మాట్లాడారు. మేము రూ.50 ఇస్తే రూ.25 అన్నారు.. ఇప్పుడు రూ.75 కాదు మేము ఇచ్చినట్లే రూ.50 ఇస్తున్నారు. ఎవరికి ఫోన్ చేసినా 50 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అంటున్నారు. ఇన్ని అబద్ధాలు చెబుతున్నారు.” అని మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
స్వయం సహాయక బృంద సభ్యులు మరణిస్తే ఇచ్చే చెక్కుల్లో కూడా మోసం జరుగుతోందని మాజీ మంత్రి మండిపడ్డారు. “గతంలో వరంగల్ లో 35 కోట్ల రూపాయల చెక్ ఇస్తే అది పాస్ కాలేదు. వరంగల్ లో ఇచ్చిన చెక్ కు మరో 9 కోట్లు కలిపి 45 కోట్ల చెక్ ఇచ్చారు. ఇది అయినా పాస్ అవుతుందా లేదా అర్థం కావట్లేదు. నా బాడీ షేమింగ్ చేస్తూ బట్టి విక్రమార్క మాట్లాడారు. రేవంత్ రెడ్డి దుష్ట సావాసం తో బట్టి కూడా మారిపోయారు. అది మీ విజ్ఞత కే వదిలేస్తున్న. మా పదేళ్ల కాలంలో పది వేల కోట్లు అయినా వడ్డీ లేని రుణాలు ఇచ్చారా అని బట్టి అడిగారు. మా పదేళ్ల కాలంలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాము. ఇలా చిల్లర గా రాజకీయం ఏంటి? అని హరీష్‌రావు ప్రశ్నించారు.