Harish Rao: బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‌లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తిట్టాలి అంటే చంద్రబాబుని తిట్టాలి.. నిందించాలి అంటే కాంగ్రెస్ పార్టీని నిందించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, చంద్రబాబు పాపాలు.. మహబూబ్ నగర్‌కి శాపాలు అంటూ ఆయన విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి పాలమూరు జిల్లాని పచ్చగా చేసింది కేసీఆర్ అని హరీష్ తెలిపారు. కేసీఆర్‌ని తిట్టడం రేవంత్ రెడ్డి అవివేకమన్నారు. కేసీఆర్ సీఎం కాక ముందు ఆయన సీఎం అయిన తర్వాత పాలమూరు జిల్లా పరిస్థితి ఏందో తెలుసుకోవాలన్నారు. వలసల జిల్లాగా పాలమూరుని మార్చింది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు అంటూ ఆయన ఆరోపించారు. 1994- 2004 మధ్య మీ పాత గురువు చంద్రబాబు ఈ జిల్లాని దత్తత తీసుకుని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వలసల జిల్లాగా చంద్రబాబు మారిస్తే.. వ్యవసాయ జిల్లాగా మార్చింది కేసీఆర్ అంటూ ఆయన పేర్కొన్నారు.
Read Also: Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి రెవెన్యూ అధికారుల షాక్
మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. టీడీపీ, కాంగ్రెస్ పాలమూరు విషయంలో డ్రామాలు చేశారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన 80 శాతం పూర్తి చేసింది కేసీఆరేనని హరీష్ చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకి పొక్క పెట్టి కృష్ణ జలాలు ఆంధ్రకు తీసుకుపోయారని ఆయన తెలిపారు. మీ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంలా మారిందని ఆరోపించారు. మీరు 30 ఏళ్లల్లో కల్వకుర్తి ప్రాజెక్టుకి 13 వేల ఎకరాలకి నీరు అందిస్తే.. మా హయాంలో 3 లక్షల ఎకరాలకి నీరిచ్చామని ఆయన తెలిపారు. వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్, టీడీపీ పార్టీలేనని హరీష్ రావు ఆరోపించారు. వలసలు బంద్ చేసి పక్క రాష్ట్రాల వారిని కూలి పనులకు పాలమూరు జిల్లాని తీసుకువచ్చింది బీఆర్‌ఎస్ అంటూ ఆయన విమరించారు. ఈ నిజాలు మీకు కనపడవా రేవంత్ రెడ్డి అంటూ సీఎంను మాజీ మంత్రి ప్రశ్నించారు. గొంతు పెద్దగా చేసినంత మాత్రాన అబద్దాలు నిజం కావు అంటూ ఆయన పేర్కొన్నారు. పాలమూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లింది కేసీఆరేనని అన్నారు.
Read Also: Demolitions: చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
మీ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాకి ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. విద్య, వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. నిజంగా మీకు చేతనైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాలువలు తవ్వి నీళ్లు అందించాలన్నారు. రేవంత్ రెడ్డి బాషా సరిగా లేదు..సీఎం మాట్లాడే భాష అలా అంటుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారన్నారు హరీష్ రావు అన్నారు. తన ఎత్తు గురించి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారన్న హరీష్ రావు.. ఆయన ఎత్తుపై మాట్లాడలేకనా అంటూ మండిపడ్డారు. ఎత్తు, బరువు ప్రజలకి అవసరం లేదని..ప్రజల కోసం ఎంత చిత్తశుద్దిగా పని చేశామన్నది ముఖ్యమన్నారు. కేసీఆర్ తన పాలనలో కిట్లు తెస్తే.. రేవంత్ తిట్లలో పోటీ పడుతున్నాడన్నారు. కృష్ణా జలాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొత్త ట్రిబ్యునల్ తెప్పించామని.. మీకు చేతనైతే మంచి వాదనలు చేసి నికర జలాలు సంపాదించాలన్నారు. పాలమూరులో ఇంటింటికి నీళ్లు ఎవరిచ్చారో ప్రజలకు తెలియదా అంటూ హరీష్ ప్రశ్నించారు. నిజాలు ఎప్పుడు నిజాలుగానే ఉంటాయన్నారు. అభివృద్ధిలో పోటీ పడి మాకంటే ఎక్కువ పని చేయాలన్నారు.