తెనాలిలోని స్థానిక ఆటోనగర్ అసోసియేషన్ హాల్లో గురువారం నాడు జరిగిన సమావేశానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన వాళ్లం విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు. రోడ్లు, నీళ్లు వంటి కనీస సౌకర్యాలకు బదులు ఓట్లు కొనుక్కోవాలనే దుష్ట ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. లారీ డ్రైవర్ల నుంచి పన్నుల రూపేణా గతం కంటే 200% ఎక్కువగా ఈ ప్రభుత్వం సామాన్యుల నుంచి వసూలు చేస్తుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మైక్రో రుణాలు, అసోసియేషన్ సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
Read Also: Vijay Sethupathi : విజయ్ సేతుపతి చేసిన పనికి శభాష్ అంటున్న ఫ్యాన్స్..
అలాగే, తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఈ ఆటోనగర్ ద్వారా 4 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఆటోనగర్లో కష్టపడే వారికి సహకరిస్తున్న సభ్యులకు అభినందనలు తెలిపారు. తాను ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో సోలార్ ప్లాంట్, పెదరావూరు – నందివెలుగు నాలుగు లైన్ల రహదారి తదితర ప్రతిపాదనలు, కేటాయింపులు చేశానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఉన్నతమైన ఆలోచనలతో తాను, పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమ ఇరువురికి ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను నాదెండ్ల కోరారు.
Read Also: Yarlagadda VenkatRao: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు విస్తృత పర్యటన..
అలాగే, గురువారం నాడు కొల్లిపర మండలంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ పర్యటనలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొల్లిపర శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రచార యాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగింది. వీధి వీధినా కొనసాగిన ప్రచార రథానికి స్థానికులు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి నాయకులకు స్వాగతం పలుకగా, అభిమానులు, కార్యకర్తలు పలు కూడళ్ల వద్ద గజమాలలు వేసి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రాంతంలోను అందుబాటులో ఉంది.. అయితే డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఈ ప్రభుత్వం అందించలేకపోవడంతో ఆ పథకం కూడా మూలన పడింది అని పెమ్మసాన్ని చంద్రశేఖర్ విమర్శించారు. ఇసుక మాఫియా జరుగుతుందని ఫిర్యాదులు చేస్తే అలాంటివి ఏమీ జరగడంలేదని మాయమాటలు చెప్పి ఈ నాయకులు తప్పించుకున్నారు. ఇసుక మాఫియా తవ్విన గోతుల వల్ల కొల్లిపర పరిసర ప్రాంతాల్లోని 38 మంది గడిచిన ఐదేళ్లలో ప్రాణాలు వదిలారు. అటు ప్రకృతి పరంగా ఇటు ప్రాణాల పరంగా భారీ నష్టం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.
Read Also: Iran Israel tensions: ఎయిరిండియా కీలక ప్రకటన.. సర్వీస్‌లు నిలిపివేత
మన ప్రాంతంలో ఇసుక, మైనింగ్, గ్రావెల్ అన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాన్ని చంద్రశేఖర్ తెలిపారు. ఈ అవినీతి సొమ్మంతా నాయకులే తింటున్నారా? లేదా పెద్ద తలలకు అందిస్తున్నారా? ప్రజా ధనాన్ని కొందరు అధికారులు, నాయకులు ఇలా దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి ఓ పవన్ కళ్యాణ్, ఒక పెమ్మసాని రాకూడదా? అని ప్రశ్నిస్తున్నాను. రాజధాని కోసం 33 వేల ఎకరాలను అందించగా, అందులో 20వేల ఎకరాలను ఒక ఎకరం మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు అందించారు. కానీ ఆ భూములన్నీ కేవలం ఒక సామాజిక వర్గమానికి మాత్రమే చెందినవంటూ ఈ ప్రభుత్వం నెపం మోపింది. ఒక వ్యక్తి పై కక్షతో లక్షలాది మంది ప్రజలకు చెందాల్సిన భూములను, ఆస్తులను, భవనాలను నిర్వీర్యం చేసింది అన్నారు. రాష్ట్రానికి రాజధాని అమరావతికి ఇంత ద్రోహం చేసిన నాయకులను ఇంకా నమ్మాలా! వద్దా! అని ప్రజలే నిర్ణయించుకోవాలి అని పెమ్మసాన్ని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.