ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్‌కు గుజరాత్ హైకోర్టులో (Gujarat High Court) చుక్కెదురైంది. ప్రధాని మోడీ (PM Modi) విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), సంజయ్ సింగ్‌లు ఇబ్బందుల్లో పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనలపై న్యాయస్థానం స్పందిస్తూ.. ట్రయల్ కోర్టులోనే వారి వాదనలు వినిపించుకోవాలని సూచిస్తూ పిటిషన్లు కొట్టివేసింది.
ప్రధాని మోడీ డిగ్రీ (PM Modi Degree Case) విషయంలో ఆప్ నేతలు చేసిన ఆరోపణలపై గతేడాది ఏప్రిల్‌లో గుజరాత్ యూనివర్సిటీ మెట్రోపాలిటిన్ కోర్టును ఆశ్రయించింది. ఆప్ నేతల వ్యాఖ్యలు వెకిలిగా.. అవమానకరంగా ఉన్నాయంటూ పిటిషన్‌లో పేర్కొంది. అదే నెలలో న్యాయస్థానం ఇద్దరు నేతలకూ సమన్లు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్, సంజయ్‌సింగ్ పైకోర్టులో ఈ సమన్లను సమీక్షించాలని కోరారు. అక్కడ దిగువ న్యాయస్థానం చర్యలను సెషన్స్ కోర్టు సమర్థించింది. దీంతో ఇద్దరు నేతలు తాత్కాలిక స్టే కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయినా కూడా వారికి అక్కడ ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా విచారణకు నిరాకరించింది. ఈ విషయాన్ని సెషన్స్ కోర్టు కొత్త బెంచ్‌కు అప్పజెప్పిన తర్వాత 10 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని తాజాగా హైకోర్టు సూచించింది.