గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఆట మొదలయ్యాక ఓపెనర్ ఎవరనే విషయం తెలుస్తుందన్నాడు. బట్లర్ వంటి ఆటగాడు ఏ స్థానంలో అయినా ఆడదానికి సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. గుజరాత్ జట్టు పూర్తి ఫిట్‌గా ఉందని, ఎటువంటి గాయాలు లేవని గిల్ వెల్లడించాడు. నేడు పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ 2025 వేలంలో జోస్ బట్లర్‌ను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోలేదు. గుజరాత్ టైటాన్స్ టీమ్ అతడిని కొనుగోలు చేసింది. రాజస్థాన్‌లో ఉన్నప్పుడు యశస్వి జైస్వాల్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ ప్రారంభించేవాడు. గుజరాత్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు లేవని, కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ అంశంపై గిల్ మాట్లాడుతూ… ‘జోస్ బట్లర్ వంటి ప్లేయర్ ఉండటాన్ని ఏ జట్టూ సమస్యగా భావించదు. టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్ కోసం, ఐపీఎల్‌లో ఎలా ఆడాడో మనం చూశాం. ఇటీవల బట్లర్ 3వ స్థానంలో బరిలోకి దిగాడు. బట్లర్ ఏ స్థానంలో ఆడతాడన్న అంశంపై మాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని చెప్పాడు.
‘జోస్ బట్లర్ స్థానంపై ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయం ఆట మొదలయ్యాక తెలుస్తుంది. బట్లర్ దాదాపు 9 ఏళ్ల నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. పలు స్థానాల్లో రాణించాడు. అందుకే బట్లర్ ఏ స్థానంలో ఆడుతాడనేది అసలు సమస్యే అనుకోము’ అని గిల్ తెలిపాడు. ఐపీఎల్‌లో బట్లర్ 107 మ్యాచులలో 3582 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 19 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా ఉన్నాడు.