Ghulam Nabi Azad: కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న గులాంనబీ ఆజాద్ ఇవాళ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఆజాద్ తన కొత్త రాజకీయ పార్టీ గురించి అడిగినప్పుడు, “నేను సోమవారం విలేకరుల సమావేశం నిర్వహిస్తాను” అని చెప్పారు. ఆదివారం ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధానికి స్వస్తి చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. జమ్మూలో తన మొదటి బహిరంగ సభలో, పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణపై దృష్టి సారించే తన సొంత రాజకీయ సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లోని ప్రజలే పార్టీకి పేరు, జెండాను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఆజాద్ కొత్త పార్టీ ప్రకటించనున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు ఒకరు ధ్రువీకరించారు. కార్యకర్తలు, నేతలతో ఆదివారం నాడు ఆయన వరుస సమావేశాలు జరుపుతున్నారని, 27న శ్రీనగర్ వెళ్తారని చెప్పారు. పార్టీ జెండా, పేరు ఖరారయ్యాయని చెప్పారు.
Rajastan Congress Crisis: రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా!
73 ఏళ్ల ఆజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకొని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేనప్పటికీ.. అన్ని నిర్ణయాలు రాహులే తీసుకుంటారని విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాతే పార్టీ పతనం ప్రారంభమైందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆజాద్‌కు మద్దతుగా జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్ సహా సుమారు 12 మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడం, ఇక్కడి స్థానికుల భూమి, ఉద్యోగ హక్కుల పరిరక్షణ తమ పార్టీ ప్రధాన ఎజాండా కానుందని ఆజాద్ ఇప్పటికే తెలియజేశారు.