Ghost saves a Teacher: దెయ్యాలు నిజంగా ఉంటాయో లేదో తెలియదు కానీ అవి అంటే మాత్రం అందరికీ భయమే. అయితే ఇవి ఉన్నయా లేవా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు ఆధారాలతో ఎటువంటి సమాధానం దొరకలేదు. అయితే కొందరు దెయ్యాలని చూశామని అవి అలా చేశాయి ఇలా చేశాయి అని చెబుతూ ఉంటారు కానీ వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కొందరు అవి ఉన్నాయని నమ్ముతుంటే కొందరు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు. అదంతా భ్రమ అని మానసిన నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అమెరికా కు చెందిన ఓ టీచర్ మాత్రం దెయ్యాన్ని చూశానని చెప్పుకొచ్చింది.
సినిమాల్లో చూపించే దెయ్యాల్లో కొన్ని చెడ్డవి ఉంటే కొన్ని మాత్రం మంచి దెయ్యాలు ఉంటాయి. కొన్ని మూవీస్ లో దెయ్యం తమ వారిని అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ టీచర్ కూడా దెయ్యం తనని కాపాడిందని చెబుతోంది. బాయ్ ఫ్రెండ్ తనని కత్తితో అతి దారుణంగా పొడిచి వెళ్లిపోతే తాను కదలలేక రక్తపు మడుగులో పడి ఉన్నానని తెలిపింది. అయితే తన పరిస్థితిని చూసి రెండు దెయ్యాలు పగలబడి నవ్వాయని అయితే అప్పుడు మరో మంచి దెయ్యం వచ్చి తనని రక్షించిందని షాకింగ్ విషయం చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే ఇలిష్ పో అనే 25 ఏళ్ల యువతి టెక్సాస్ రాష్ట్రంలో ఉంటుంది. కొలరాడోలోని ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. 2020 సంవత్సరంలో తన ప్రియుడు తనపై కత్తితో దాడికి పాల్పడ్డాడని, 16 సార్లు కత్తితో పొడిచి చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో తనకు మూడు దెయ్యాలు కనిపించాయని అందులో ఒక దెయ్యం తన అమ్మమ్మ అని తెలిపింది. 2014లోనే తన అమ్మమ్మ జీని మరణించిందని ఇలిష్ తెలిపింది. అయితే అక్కడ ఉన్న మరో దెయ్యం తన చిన్ననాటి స్నేహితుల్లో ఒకరైన విక్కీ అని, అతను 2020 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ కథ వింటుంటే మనం సాధారణంగా అమ్మమ్మ అని చెప్పిన దెయ్యం కాపాడుతుందని అనుకుంటాం కదా. కానీ అక్కడే మరో ట్విస్ట్ చెప్పింది ఇలిష్. తాను రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడు ఈ రెండు దెయ్యాలు నవ్వాయట. ఇక మూడో దెయ్యం అలీసా బర్కెట్ అనే అమ్మాయి. ఈమె తనకు దూరపు బంధువని, అలీసానే తనని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిందని చెప్పుకొచ్చింది.
ఇటీవలే ఓ షోలో పాల్గొన్న ఆమె గతంలో తన జీవితంలో జరిగిన ‘దెయ్యం’ ఘటనను వివరించింది. తనను ఫోన్ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు ఫోన్ చేసేలా చేసిందని, దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి తనని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చింది. అప్పడు కూడా తనకు కొన్ని అస్పష్టమైన రూపాలు కనిపించేవని తెలిపింది. ప్రస్తుతం ఈ టీచర్ చెప్పిన దెయ్యం కథ వైరల్ అవుతుంది. ఈమె చెబుతున్నది నిజమేనా నిజమే అయితే అమ్మమ్మ కాపాడాలి కానీ దూరపు బంధువు కాపాడటం ఏంటి అని అనుకుంటున్నారు. అంతేకాకుండా నిజంగా ఈమెకు దెయ్యాలు సాయం చేశాయా లేక ఏదైనా భ్రమలో ఉండి ఇలా చెబుతుందా అని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. అయితే ఈమె చెప్పింది కూడా నిజమేనని నమ్ముతున్న వారు కూడా ఉన్నారు.