తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక, వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసాద్ కుమార్.. గతంలో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే, జి. ప్రసాద్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అలాగే, 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్ కుమార్ గెలిచారు.
Read Also: Parliament Winter Session 2023: నాలుగో రోజుకి చేరుకున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
దీంతో, గడ్డం ప్రసాద్ కుమార్ కు 2012లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చింది. ఇక, ఆయన 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు. గడ్డం ప్రసాద్‌కుమార్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో మరోసారి ఆయనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా సముచిత స్థానం కల్పించింది.