HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సమీపంలోని బాచుపల్లి లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసే అంశంపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఒక సంస్థ సీఈఓ పై హెచ్ఎండీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి లో హెచ్ఎండీఏ 73 ప్లాట్లతో లేఅవుట్ ను రూపొందించింది. దీనిపై ఫిబ్రవరి 17న బాచుపల్లి లేఅవుట్ లో హెచ్ఎండీఏ అధికారులు ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 300 మంది హాజరు అయ్యారు. బాచుపల్లి లేఅవుట్ కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యక్తులు, సంస్థలు, హెచ్ఎండీఏ పేరుతో సాధారణ ప్రజానీకాన్ని, ప్లాట్ ల కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్ఎండీఏ సూచించింది.
Read Also: TS Lawcet : తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారు
బాచుపల్లి లే అవుట్లోని 73 ప్లాట్లపై మార్చి 2, 3వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆన్ లైన్ ద్వారా వేలం (ఈ – ఆక్షన్) నిర్వహించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, మియాపూర్ క్రాస్ రోడ్డుకు, ఐటి హబ్ కు సమీపంలో ఉన్న బాచుపల్లి లేఅవుట్ పరిసరాల్లో పలు గెటడ్ కమ్యూనిటీ విల్లా వెంచర్ల మధ్యలో ఉండడం వల్ల ఎంతోమంది ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ బాచుపల్లి లేఅవుట్ లోని ప్లాట్ల కొనుగోలుకు పెట్టుబడుల స్వీకరణ పేరిట ఒక ఆంగ్ల దినపత్రికలో గత శనివారం(25వ తేదీ), ఆదివారం(26వ తేదీ) ప్రకటనలు ఇచ్చి ప్రజలను, ప్లాట్ల కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాన్ని హెచ్ఎండీఏ సీరియస్ గా తీసుకుంది. హెచ్ఎండిఏ పేరును ప్రస్తావిస్తూ ప్రజానీకాన్ని, కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి వారి మోసాలకు కళ్లెం వేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.