Fox Cricket’s All-Time Men’s Cricket World Cup XI: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన ‘ఫాక్స్ క్రికెట్’ తన ఆల్‌టైమ్ ప్రపంచకప్ ఎలెవన్‌ను ప్రకటించింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఫాక్స్ క్రికెట్ తన జట్టులోకి చోటిచ్చింది. ఈ ఆల్‌టైమ్ ప్రపంచకప్ ఎలెవన్‌కు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ కెప్టెన్ కాగా.. కుమార సంగక్కర వికెట్ కీపర్. ఈ జట్టులో అత్యధికంగా ఆసీస్ నుంచి నలుగురు ప్లేయర్స్ ఉన్నారు.
ఫాక్స్ క్రికెట్ ఎలెవన్‌లో భారత్ నుంచి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలకు చోటు దక్కింది. అయితే భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఎంఎస్ ధోనీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. రికీ పాంటింగ్ సారథ్యంలో 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లను ఆస్ట్రేలియా గెలిచింది. అందుకే అతడికి సారథ్యం ఇచినట్లు ఫాక్స్ క్రికెట్ పేర్కొంది. అయితే రికీ కంటే మహీనే అత్యుత్తమ కెప్టెన్ అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆస్ట్రేలియా నుంచి ఏకంగా నలుగురు ఆటగాళ్లకు ఫాక్స్ క్రికెట్ చోటిచ్చింది. రికీ పాంటింగ్, షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్, మిచెల్ స్టార్క్ లు ఎంపికయ్యారు. వెస్టిండీస్ (వీవ్ రిచర్డ్స్), పాకిస్థాన్ (వసీమ్ అక్రమ్) నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. శ్రీలంక నుంచి ముత్తయ్య మురళీదరన్, కుమార సంగక్కరకు అవకాశం దక్కింది. ఇంగ్లండ్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి ఒక్కరు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
ఫాక్స్ క్రికెట్ టీమ్:
1. సచిన్ టెండూల్కర్
2. రోహిత్ శర్మ
3. రికీ పాంటింగ్ (కెప్టెన్)
4. విరాట్ కోహ్లీ
5. వివ్ రిచర్డ్స్
6. కుమార్ సంగక్కర
7. వసీం అక్రమ్
8. మిచెల్ స్టార్క్
9. షేన్ వార్న్
10. గ్లెన్ మెక్‌గ్రాత్
11. ఎం మురళీధరన్