Maharashtra Elections: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం (అక్టోబర్ 29) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. సుమారు 8 వేల మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నవంబర్ 20న జరగనున్న ఎన్నికల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 22న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 29వ తేదీతో ముగిసింది. నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 30న జరుగుతుందని, అభ్యర్థులు నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అందిన సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో 148 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
అలాగే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాగా, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 53 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. మహాయుతి ఇతర మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇవ్వగా, రెండు సీట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపక్షం మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి) 89 స్థానాల్లో, ఎన్‌సిపి (ఎస్‌పి) 87 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇతర ఎంవీఏ మిత్రపక్షాలకు ఆరు సీట్లు ఇవ్వగా, మూడు అసెంబ్లీ స్థానాలపై స్పష్టత లేదు. దీనితో పాటు, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 14 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది.
Also Read: China Launched Shenzhou-19: షెన్‌జౌ-19 అంతరిక్ష యాత్రను ప్రారంభించిన చైనా