2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ‘జమిలి ఎన్నికలు’ అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలి జరిగే అవకాశం ఉంటుందన్నారు. జమిలిపై ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, జమిలితో ఈ భారీ వ్యయం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కాట్టాన్‌కొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో శనివారం ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘2029 తర్వాతే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయి. ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అప్పుడు ప్రారంభిస్తేనే 2034లో జమిలి జరిగే అవకాశం ఉంటుంది. ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. పార్లమెం టుకు, శాసనసభకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ద్వారా ప్రజల సొమ్మును ఆదా చేయొచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికలకు దాదాపు రూ.లక్ష కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక అనేది కొత్త ఆలోచన కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే’ అని తెలిపారు.
Also Read: Vijay Shankar: శంకరన్నా.. అందరూ నవ్వుకుంటున్నారే!
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై నిర్మాలసీతా రామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకదేశం ఒకే ఎన్నిక అనేది ఎవరి సోంత కార్యక్రమం కాదు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాకే ఈ నిర్ణయంపై ముందుకు వెళ్తాము. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం జమిలి వద్దు అంటూ కొన్ని పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి సైతం స్వీయ చరిత్రలో జమిలి ఎన్నికలకు మద్దతుగా రాశారు, మద్దతు ప్రకటించారు. కానీ ఆయన కోడుకు స్టాలిన్ మాత్రం తండ్రి మాటకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాను అంటున్నారు. రాజకీయం లద్ది కోసం స్టాలిన్ చేస్తున్న పనులు ప్రజలు గుర్తించాలి’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.