ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. అస్సాంలో వరదల వల్ల ఇప్పటి వరకు 54 లక్షల మంది ప్రభావితం అయ్యారు. తాజాగా గురువారం వరదల కారణంగా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితులు భయంకరంగా మారాయి. చాలా జిల్లాలు వరద తాకిడికి గురయ్యాయి. మొత్తం 36 జిల్లాల్లో 32 జిల్లాలు ముంపుకు గురయ్యాయి.
వరదల వల్ల ఇప్పటి వరకు అస్సాంలో మరణాల సంఖ్య 101కి చేరుకుంది. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల గ్రామాలు పట్టణాలు చాలా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 276 బోట్ల సహాయంతో మొత్తం 3,658 మందిని ఎన్డీఆఫ్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు 12 వరద ప్రభావిత జిల్లాల్లో 14500 మందిని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు.
కమ్రూప్, కమ్రూప్ రూరల్, బొంగైగావ్, బార్పేట, బజలి, హోజాయ్, నల్బరి, దరాంగ్, తముల్‌పూర్, నాగావ్, ఉడల్‌గురి, కాచర్ జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలతో అల్లాడుతున్న ప్రజలకు అధికారులు సహాయక సామాగ్రి, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ( సీడబ్ల్యుసీ) నివేదిక ప్రకారం కోపిలి నది, దిసాంగ్ నది, బ్రహ్మపుత్ర, బరాక్ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 54,57,601 మంది వరద ప్రభావానికి గురయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. డిమా హసావో, కరీంగంజ్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. బారక్ వాలీలోని కాచర్, హైలాకండీ, కరీంగంజ్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బరాక్, కుషియారా నదుల ఉగ్రరూపానికి దారుణంగా దెబ్బతిన్నాయి. సిల్చార్ పట్టణం గత నాలుగు రోజులుగా వరదనీటిలో ఉంది.