Tirumala: కొలిచినవారి కొంగు బంగారంగా భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది.. శ్రీవారి ఆలయం మీదుగా తరుచూ విమానాలు ఎగురుతూనే ఉండగా.. ఇవాళ కూడా ఆలయ గోపురం మీదుగా మరోసారి ప్రయాణించింది విమానం.. ఆలయం మీదుగా విమానాలు ఎగరకుండా చూడాలంటూ రేణిగుంట విమానాశ్రయం అధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.. దీనికి తోడు.. తిరుమల నో ప్లై జోన్ కాదంటూ ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు చెబుతున్నారు.. ఎయిర్ ట్రాఫిక్ పెరిగితే.. తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదు అన్నట్లుగా ఏటీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. అయితే, తరచూ విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా ఎగరడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గత కొన్నాళ్లుగా నడకదారిలో తిరుమలకు వెళ్లే భక్తులు భయంతో వణికిపోతున్నారు. దానికి ప్రధాన కారణం.. ఓ బాలుడిపై చిరుత దాడి చేయగా.. మరో ఘటనలో చిన్నారి మృతిచెందింది.. దీంతో అప్రమత్తమైన టీటీడీ.. ఆపరేషన్ చిరుత కొనసాగిస్తోంది.. ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించింది. అయినా.. ఆపరేషన్ చిరుత కొనసాగిస్తాం అంటున్నారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి.