ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు ప్రయాణికులు జుగుప్సకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలతో నిత్యం ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాయి. విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ నెలకొనడంతో టేకాఫ్ అయిన అరగంటకే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ర్యాన్‌ఎయిర్ విమానం బుధవారం మొరాకోలోని అగాదిర్ నుంచి లండన్‌కు బయల్దేరింది. ఇంతలో ఓ వ్యక్తి.. మహిళా ప్రయాణికురాలి దగ్గరకు వచ్చి తన భార్య, పిల్లలతో కూర్చోవడానికి సీటును ఇవ్వాల్సిందిగా అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో బెదిరింపులకు దిగాడు. మహిళ భర్త అతడిని వారించడంతో వాగ్వాదం నెలకొంది. మహిళ బంధువులు సైతం అదే విమానంలో ఉండడంతో వారు సదరు వ్యక్తితో గొడవకు దిగారు.
ఇది కూడా చదవండి: SLBC Meeting: రేపు బ్యాంకర్ల కమిటీ సమావేశం.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలుపై సీఎం ఫోకస్..
ఒకరినొకరు దూషించుకుంటూ దాడికి దిగడంతో ఇతర ప్రయాణికులు, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని మరకేష్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ విమానంలో ఉన్న 36 నిమిషాలు ఒక నరకంలాగా అనిపిందని, పిల్లలు భయంతో ఏడుస్తూనే ఉన్నారని వాపోయింది.
ఇది కూడా చదవండి: Mercedesbenz EV: ఇండియాలో మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 560 కి.మీ
ఇదిలా ఉండగా మరో ప్రయాణికుడు అస్వస్థతకు గురవ్వడంతో మరకేష్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే వైద్యులు అతడికి ఆక్సిజన్ పెట్టారు. ఆరోగ్యం సరిగ్గా లేనందున విమానం దిగాల్సిందిగా కోరగా అందుకు నిరాకరించాడు. అయితే ఎట్టకేలకు అధికారులు అతడిని విమానం నుంచి దించారు. ఈ ఘటనలతో విమానం లండన్ చేరుకోవడానికి ఆలస్యమైంది. దీనిపై ర్యాన్‌ఎయిర్ అధికారులు స్పందిస్తూ .. అనారోగ్యానికి గురైన వ్యక్తికి వైద్యం చేయడానికి, విమానాన్ని తిరిగి టేకాఫ్ చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందన్నారు. కొందరి వల్ల ఇతర ప్రయాణికులకు జరిగిన ఆలస్యానికి, అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: దశాబ్ధం ముగిసినా ప్రజల గుండెల్లో ఉన్న సీఎం వైఎస్సార్..