Fake Seeds : నకిలీ విత్తనాల మాఫియా కొత్త పంథాలో అడుగులు వేస్తోంది. పశువుల దాణా పేరుతో నిషేధిత విత్తనాలను సరఫరా చేస్తూ, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాలకు పార్సిల్ రూపంలో పంపిస్తున్నారు. అధికారులు ఈ నకిలీ విత్తనాల దందాపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మాఫియా కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాలతో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కుమరంభీం , మంచిర్యాల జిల్లాల్లో నకిలీ విత్తనాల దందా ఊపందుకుంది. ఇటీవల పోలీసులు బస్తాల కొద్దీ నిషేధిత పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఈ జిల్లాల్లో భారీ ఎత్తున నిషేధిత విత్తనాల సరఫరా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, కఠిన నిఘాను అమలు చేసి లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మాఫియా కొత్త వ్యూహాలతో పార్సిల్ సర్వీసుల ద్వారా విత్తనాలను సరఫరా చేస్తోంది.
విజయవాడలోని నవత ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఉప్పుగుండూరుకు చెందిన నరేష్ పేరుతో బుక్ చేసిన ఒక పార్సిల్, సిరిపూర్ కాగజ్‌నగర్‌లోని నవత ట్రాన్స్‌పోర్ట్‌కు కె. శేఖర్ పేరుతో వచ్చింది. పత్రాల ప్రకారం ఆ పార్సిల్‌లో 48 కిలోల పశువుల దాణా ఉన్నట్లు తెలిపినప్పటికీ, తనిఖీలో పోలీసులకు నకిలీ విత్తనాలు దొరికాయి. వాటిని సీజ్ చేసిన పోలీసులు, ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సరఫరా అవుతున్న నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలపై దృష్టి సారించారు.
కాగజ్‌నగర్‌లోని ట్రాన్స్‌పోర్ట్ సంస్థల ద్వారా వివిధ జిల్లాల నుంచి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. మంచిర్యాల, కుమరంభీం జిల్లాల్లో నకిలీ విత్తనాల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ, కేటుగాళ్లు ఉల్లిగడ్డలు, ఇతర వస్తువుల పేరుతో దందాను కొనసాగిస్తున్నారు. గతంలో నాగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్ నుంచి మంచిర్యాలకు నకిలీ విత్తనాలు సరఫరా అవుతుండగా, పోలీసులు వాటిని పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థానిక భూములను కౌలుకు తీసుకుని నకిలీ విత్తనాల దందా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీటీ కాటన్, హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వంటి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే దళారీలపై 2025 ఫిబ్రవరి చివరి వారంలో , మార్చిలో ఆరు కేసులు నమోదు చేశారు. దాదాపు 8.5 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సీజ్ చేసి, 31 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
కుమరంభీం జిల్లాలో ఇటీవల 300 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. రైళ్లు, ఉల్లిగడ్డలు లేదా ప్రత్యేక వాహనాల ద్వారా రవాణా చేస్తే దొరికిపోతామనే భయంతో, ట్రాన్స్‌పోర్ట్ సంస్థల ద్వారా నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లో ట్రాన్స్‌పోర్ట్ ద్వారా వచ్చిన నకిలీ విత్తనాలను సీజ్ చేయడంతో ఈ దందా కొత్త రూట్లు తొక్కుతున్నట్లు వెల్లడైంది.
Waqf Act: ‘‘తలలు పగలాలి, 10 మంది చావాలి’’.. వక్ఫ్ చట్టంపై హింసను ప్రేరేపించిన కాంగ్రెస్ నేత..