Fake Certificates: హైదరాబాద్‌లో నకిలీ విద్యా సర్టిఫికెట్ల విక్రయాలను చేపట్టిన ముఠాను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం గుట్టురట్టు చేశారు. కన్సల్టెన్సీ పేరుతో మోసాలను కొనసాగిస్తూ యువత భవిష్యత్‌ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ముఠాపై పోలీసులు ఘాటుగా స్పందించారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరుతో ఈ నకిలీ దందాను నిర్వహిస్తున్న మహ్మద్ ముజీబ్ హుస్సేన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మే 12న మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాఠశాల వద్ద నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న సమయంలో ముజీబ్ హుస్సేన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Also: Miss World 2025: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రయతించనున్న సుందరీమణులు..!
ముజీబ్‌తో పాటు నకిలీ సర్టిఫికెట్ కొనుగోలు చేయడానికి వచ్చిన నాసిర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం ముఠాలో సభ్యులుగా ఉన్న రహమాన్, సిద్ధిఖీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అధికారులు మొత్తం 108 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా కోల్కతాకు చెందిన మనోజ్ విశ్వాస్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన రవీందర్, ముఖేష్‌ల నుంచి ఈ నకిలీ సర్టిఫికెట్లు సేకరించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ దందా ద్వారా విద్యార్థులను మోసం చేస్తూ డబ్బు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్ల ముఠాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.