CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (మే 14) పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు ఆయన వివిధ అధికార సమీక్షలు, నియామక పత్రాల పంపిణీ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల పర్యవేక్షనకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత, సాయంత్రం 4:30 గంటలకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని నీటి వినియోగం, సాగునీటి పంపకాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై సమగ్ర సమీక్ష చేయనున్నారు.
Read Also: Miss World 2025: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రయతించనున్న సుందరీమణులు..!
అనంతరం సాయంత్రం 6:30 గంటలకు జలసౌధలో “కొలువుల పండుగ” కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్ (AE), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (JTO)లకు నియామక పత్రాలు ఆయన అందజేయనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగులను సీఎం అభినందించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ప్రాధాన్యత కలిగిన నీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో మరో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నీటి వనరుల వినియోగంలో సమన్వయం, రాష్ట్రానికి హక్కుగా లభించాల్సిన వాటా తదితర అంశాలను ఈ సమావేశంలో సీఎం సమీక్షించే అవకాశముంది.