TDP: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కదిరి టికెట్ ఆశించిన అత్తార్ చాంద్ బాషా.. టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చాంద్ బాషా లేఖ రాశారు. రేపు కదిరిలో సీఎం జగన్ సమక్షంలో చాంద్ బాషా వైసీపీలో చేరనున్నారు.
Read Also: Pawan Kalyan: పిఠాపురంలో విజయం తథ్యం.. కార్యకర్తలకు పవన్ దిశానిర్ధేశం
మంత్రి పదవితో పాటు తగిన గుర్తింపును ఇస్తామని చంద్రబాబు మాట తప్పాడని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు గాని, బహిరంగ సభకు కానీ కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. తనకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ కృతజ్ఞుడినే అని ఆయన వ్యాఖ్యానించారు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా స్పష్టం చేశారు.
Read Also: Seediri Appalaraju: వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పని చేయడం నేరమా..?