EX Minister Pomguru Narayana Comments on Chandrababu Naidu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో ఈరోజు కుటుంబ సభ్యులు ములాఖాత్ అయ్యారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ అనంతరం రాజమండ్రి విద్యానగర్‌లో ఉన్న క్యాంపు ఆఫీసుకు భువనేశ్వరి, బ్రాహ్మణి తిరిగి వెళ్లారు. మరోవైపు మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదని తెలిపారు.
‘జైలులో నారా చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదు. వ్యవసాయ రంగానికి విశేష కృషి చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతికి సంతాపం తెలియజేయమని బాబు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ, మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని టీడీపీ శ్రేణులను కోరారు. న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. టీడీపీకి వస్తున్న ప్రజాదరణను అణచివేయాలని అధికార పార్టీ చూస్తున్నా.. మా పార్టీకి ఆదరణ పెరుగుతుంది తప్ప తగ్గదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వర్గమూ ఆనందంగా లేదు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ అనే విషయం అందరికీ తెలుసు’ అని నారాయణ అన్నారు.
Also Read: Nara Lokesh: మరో రెండు కేసుల్లో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు!
‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ 41ఏ నోటీసు ఇచ్చారు. ఇది మా మొదటి విజయం. టీడీపీ, జనసేన రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళుతాం. నా సొంత భూమి ఇన్నర్ రింగ్ రోడ్డులో పోయింది. 2001లో ఈడుపుగల్లులో కొన్న 40 సెంట్ల సొంత స్థలం అది. దాని విలువ రూ. 7 కోట్లు. సొంత భూమే పొగొట్టుకున్న నేను.. అవినీతి చేస్తానా? చెప్పండి. కావాలనే మాపై బురద చల్లుతున్నారు. మాపై చేసే ఆరోపణల్లో నిజమేంటో కోర్టుల్లో తేలుతుంది’ అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.