Etela Rajender: కేసీఆర్ అబద్ధాల గురించి ఎన్ని చెప్పినా తక్కువేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని ఆదిలాబాద్ జిల్లాలోని గిమ్మ గ్రామంలో ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాల్లో రైతాంగాన్ని ప్రశాంతంగా ఉండకూడదు అని రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిన పార్టీ టీఆర్‌ఎస్ అని, నాశనం చేసిన నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు. ధరణి మనకోసం తేలేదని, మన కళ్లల్లో మట్టి కొట్టడానికి తెచ్చారని ఈటల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్‌లో ఎకరం 100 కోట్లు ఉంటుందని.. 2000 ఎకరాలు మాయం చేసి లక్ష కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చే డబ్బులు ఫామ్ హౌస్ అమ్మి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.
వాడవాడకి బెల్ట్ షాప్ పెట్టి మన ప్రాణం తీస్తున్నారన్న ఈటల.. సంవత్సరానికి మనం కడుతున్న డబ్బు 42 వేలకోట్లు అని అన్నారు. ఆయన పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు పేరిట ఇచ్చేది 25 వేల కోట్లేనని పేర్కొన్నారు. ఈ లెక్క తప్పు అయితే ముక్కు నేలకు రాస్తా అని సవాల్ విసిరారు. కేసీఆర్ వల్లనే ఒక మహిళా ఎమ్మార్వో మీద పెట్రోలు పోసి తగలబెట్టారని ఆరోపించారు. డిపార్ట్‌మెంట్‌ను అంపశయ్య మీద పడుకోబెట్టి అయన మార్క్ రాజకీయం మొదలు పెట్టారని విమర్శించారు. అసైన్‌మెంట్ భూములన్నీ స్వాధీనం చేసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ధరణిలో భూమి తప్పు పడింది అంటే కోర్టుకు పొమ్మంటున్నారన్నారు. పేద రైతు లక్షల ఖర్చుపెట్టి కోర్టు మెట్లు ఎక్కగలరా ? అంటూ ఈటల ప్రశ్నించారు. ధరణి మనకోసం తేలేదని, మన కళ్లల్లో మట్టి కొట్టడానికి తెచ్చారన్నారు.
KTR Fires on Centre: విద్యుత్‌ను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర..
ఇవన్నీ వీఆర్‌ఏ, వీఆర్వో, ఎమ్మార్వోలకు తెలుస్తుందని వారిని తప్పించి.. ప్రగతిభవన్ చేతిలో స్విచ్ పెట్టుకొని వారి బినామీల పేరిట భూములు ఎక్కించుకున్నారని ఆరోపించారు. వీఆర్‌ఏలు శాసన సభలో ఇచ్చిన హామీ అమలు చేయమంటున్నారని డిమాండ్ చేస్తున్నారన్నారు. 60 రోజులుగా సమ్మె చేస్తున్నా 50 మంది చనిపోయినా నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. గ్రామ కార్యదర్శుల మీద పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఇంట్లో నీల్లొస్తాయని చెప్పారని.. ఎక్కడ నీళ్లంటూ ఆయన ప్రశ్నించారు. రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ ద్వారా వచ్చిన నీళ్లు తాగేవిధంగా లేవని.. నాచు, మురికి వస్తుందన్నారు.
”డబుల్ బెడ్ రూం వద్దయ్యా ఎవరిజాగలో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇద్దాం అని చెప్పినం. వినకుండా మొండికేసి ఇప్పుడు పేదవారికి సొంత ఇల్లు లేకుండా చేశారు. రాంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఒక్కొక్కరి దగ్గర 70 వేలు తీసుకున్నారట. పంజాబ్, హర్యానా పోయి డబ్బులు ఇచ్చి వస్తున్నవ్.” అని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.