మరోసారి టీఆర్‌ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గురువారం ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. హుజురాబాద్ ప్రజలు వారి గౌరవం నిలబెట్టాలని నన్ను గెలిపించి పంపించారని, గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే అనే గుర్తింపు లేకుండా చేశారన్నారు. ప్రశాంతమైన హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే సమస్యల మీద మాట్లాడండి అని ఆయన సవాల్ విసిరారు. దొడ్డి దారిన యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దమ్ముంటే నేరుగా యుద్ధం చేయండని, నేను చేసిన సవాలు స్వీకరించండని ఆయన వెల్లడించారు.
గజ్వేల్ లో కొట్లాడుదామా? హుజురాబాద్లో కొట్లాడుదామా? రండి అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో ఉన్న ప్రజాప్రతినిధులారా వారు చేసే కుట్రలో మనం భాగం పంచుకోవద్దని, బలి కావద్దు అని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. మేము తలుచుకుంటే పొలిమేరల దాకా తరిమి కొట్టే శక్తి ఉందని, చిల్లర మాటలు నమ్మి అనవసరంగా రెచ్చిపోవద్దని హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి అని ఆయన అన్నారు.