Emergency in Ecuador: ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు గురైన నేపథ్యంలో గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదే సమయంలో హత్యపై దర్యాప్తులో సహాయం చేయాలని ఎఫ్‌బిఐని కోరారు. 59 ఏళ్ల జర్నలిస్ట్, అవినీతి వ్యతిరేక క్రూసేడర్ ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు సంబంధించి ఆరుగురు కొలంబియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి రాజధాని క్విటోలో ర్యాలీ నుంచి బయలుదేరిన ఫెర్నాండోపై కాల్పులు జరిగాయి. కొలంబియాకు చెందిన మరో నిందితుడిని భద్రతా ఏజెంట్లు కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. దాడి చేసినవారు వ్యవస్థీకృత క్రైమ్ గ్రూపులకు”చెందినవారని అంతర్గత మంత్రి జువాన్ జపాటా తెలిపారు. అయితే, వారు ఏ గ్రూపులకు చెందన వారో ఆయన స్పష్టం చేయలేదు. ఈ దాడిలో జాతీయ శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థి, ముగ్గురు పోలీసులతో సహా మరో తొమ్మిది మంది గాయపడ్డారని ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులు తెలిపారు.
Read Also: Supreme Court: ‘ఇండియా’ పేరుపై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో రెండు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయం కోసం ఈక్వెడార్ చేసిన అభ్యర్థనను యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అంగీకరించిందని ఆయన చెప్పారు. త్వరలో ఇక్కడికి ప్రతినిధి బృందం రానుంది. లాస్సో మూడు రోజుల జాతీయ సంతాప దినాలు కూడా ప్రకటించారు. దేశంలోని అత్యంత శక్తివంతమైన మాదక ద్రవ్యాల ముఠాలలో ఒకటైన లాస్ చోనెరోస్ నుంచి బెదిరింపుల గురించి విల్లావిసెన్సియో ఫిర్యాదు చేశాడు. ఈ వారం ప్రారంభంలో ముఠా జన్మస్థలమైన చోన్‌లో జరిగిన ర్యాలీలో విల్లావిసెన్సియో ఈ విషయాన్ని చెప్పారు. ఆగస్టు 20న మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనకు బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. ఇటీవలి వారాల్లో ప్రముఖ మేయర్, శాసనసభ్యుడు కూడా హత్యకు గురయ్యారు. విల్లావిసెన్సియో తలపై మూడు షాట్లతో చంపబడ్డారని ఆ దేశ ప్రధాన వార్తాపత్రిక ఎల్ యూనివర్సో నివేదించింది. మధ్యంతర ఎన్నికలకు వారం రోజుల ముందు ఈ దాడి జరిగింది. అంత్యక్రియల కోసం విల్లావిసెన్సియో మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెళ్లినప్పుడు, ఆయన కుటుంబం కన్నీళ్లతో విలపించింది.
Read Also: Adani Ports: మేనేజ్‌మెంట్‌తో విభేదాలు.. అదానీ పోర్ట్స్ ఆడిటర్ పదవికి డెలాయిట్ రాజీనామా
ఇటీవలి ఒపీనియన్ పోల్స్ ప్రకారం, ప్రెసిడెంట్ రేసులో ఉన్న ఎనిమిది మంది అభ్యర్థులలో విల్లావిసెన్సియో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన అభ్యర్థి. ఆయన జర్నలిజం ద్వారా విస్తారమైన అవినీతి నెట్‌వర్క్‌ను బహిర్గతం చేశాడు. ఇది మాజీ అధ్యక్షుడు రాఫెల్ కొరియాకు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి దారితీసింది. అయితే, జైలు శిక్షను తప్పించుకోవడానికి పారిపోయిన కొరియా ఇప్పుడు బెల్జియంలో ప్రవాసంలో నివసిస్తున్నాడు.
ఈక్వెడార్‌లో జరిగిన ఘటనపై ప్రపంచ నేతలు ఏం చెప్పారు?
విల్లావిసెన్సియో హత్యకు పాల్పడిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో స్థానిక అధికారులకు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మద్దతు ఇచ్చాడు.
హింసకు వ్యతిరేకంగా పోరాటంలో తాము ఈక్వెడార్‌తో పాటు నిలబడతామని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ అన్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. హింసాకాండలో దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇది నొక్కిచెప్పిందని యూఎన్ మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ అన్నారు.