Elon musk: ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మనసు మారింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి మస్క్ మళ్లీ సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఈ వార్తలతో మంగళవారం ట్విట్టర్ షేర్లు ఒక్కసారిగా 13 శాతం పెరిగి 47.95 డాలర్లకు చేరాయి. దాంతో ఈ కౌంటర్‌లో ట్రేడింగ్ నిలిపి వేశారు. నకిలీ ఖాతాల విషయం కోర్టులో నిరూపించడం కష్టమని తేలడంతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ ఏప్రిల్‌లో 44 బిలియన్ డాలర్లకు (రూ.3.50 లక్షల కోట్లు) ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ డీల్ ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కారణం ట్విట్టర్‌లో ఎన్నో స్పామ్, ఫేక్ అకౌంట్లు ఉన్నాయని.. కారణం చెప్పారు. దీనిపై ట్విట్టర్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. ఈ వ్యవహారం కొన్నినెలల పాటు సాగింది. ఈ కాలంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది.
Read Also: Special Story on Global Recesssion Fears: అదిగదిగో ఆర్థికమాంద్యం.. భయపడుతున్న ప్రపంచం..
మస్క్ నుంచి ప్రతిపాదనకు సంబంధించి లెటర్ అందిందని ఒక చిన్న ప్రకటనలో ట్విట్టర్ తెలిపింది. ఒప్పందాన్ని వీలైనంత తొందరగా ముగించడానికి కంపెనీ కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. అయితే.. ట్విట్టర్ దావాపై మరో రెండు వారాల్లో విచారణ జరగనున్న నేపథ్యంలో మస్క్ మరోసారి ప్రతిపాదన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. మస్క్ ఈసారి తన డీల్‌కు కట్టుబడి ఉండేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని ట్విట్టర్ కోరుకుంటున్నట్లు తెలిసింది. ఇంకా.. డీల్‌ను ఆలస్యం చేసినందుకు మస్క్ నుంచి అదనంగా వడ్డీని కూడా డిమాండ్ చేస్తున్నట్లు కంపెనీతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. మస్క్ మళ్లీ ఆఫర్ చేసినట్లు వచ్చిన వార్తలను తొలుత బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.