Telangana Assembly Elections 2023: తెలంగాణలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లున్నారు. దీంతో.. వారందరికీ సరిపోయేలా.. 35వేల 635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది ఈసీ. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలను ఈసీ సిద్ధం చేసింది.
ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ప్రింట్ చేసి పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపించారు అధికారులు. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారు. ఇప్పటికే 9174మంది సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్లు, టెండర్, ఛాలెంజ్ ఓట్ల కోసం బ్యాలెట్లు కలిపి మొత్తం 14లక్షలకుపైగా ప్రింట్ చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల కమిషనింగ్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైంది. రాష్ట్రంలో 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలుండగా.. 59వేల 775 బ్యాలెట్ యూనిట్‌లను రెడీ చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది. అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.
Read Also: Telangana: తెలంగాణలో పంపకాలు షూరు..
ఇక, ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలో ప్రచారంపై పడ్డాయి.. అగ్రనేతలను రంగంలోకి దించుతున్నాయి.. అధికార బీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్యతను, సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు లాంటి నేతలు భుజాన వేసుకుంటే.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు.. వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులను.. పార్టీ అగ్రనేతలను, బీజేపీ అయితే, కేంద్ర మంత్రులను కూడా రంగంలోకి దింపింది.. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు.