ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌తో పాటు పార్టీని కూడా ఛార్జీషీటులో చేర్చింది. ఒక జాతీయ పార్టీని ఛార్జీషీటులో దాఖలు చేయడం ఇదే తొలిసారి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ.. గోవా ఎన్నికల్లో రూ.45 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంది. ఈ ఛార్జీషీటులో మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్‌ను సూత్రదారులుగా చేర్చింది.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఆ క్రమంలో ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. అంతకుముందు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సింఘ్వీ తన వాదనలు వినిపించారు.
అయితే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలున్నాయని.. ఈ నేపథ్యంలో ట్రయిల్ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. ఇక ఈ వ్యవహారంలో కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చర్చలు నడిచాయని పేర్కొంది. ఆ క్రమంలో హవాలా ఆపరేటర్లు.. వారి ఫోన్లను ధ్వంసం చేశారని సోలిసిటర్ జనరల్ ఈ సందర్బంగా కోర్టుకు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు.
తాజాగా ఆయన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. జూన్ 2న తిరిగి సరెండ్ అవ్వాలి.