Andhra Pradesh: ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రేపట్నుంచి(ఈ నెల 18) ఈ నెల 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్ఐసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్ గ్రేడేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని గవర్నరుకు, ఏపీ సీఈఓకు చంద్రబాబు లేఖలు రాశారు. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియపై ఎన్ఐసీ ప్రతినిధులను పిలిపించి ఏపీ సీఈఓ ఆరా తీశారు. ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను నిలపాలని ఎన్ఐసీకి సీఈఓ ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ఈ ఆఫీస్ వెర్షన్‌తోనే విధులు నిర్వహించాలని హెచ్‌వోడీలను ప్రభుత్వం ఆదేశించింది.
అసలు విషయం ఏమిటంటే.. ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్ సాయంతో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌లో కొత్త వెర్షన్‌ను ఎన్‌ఐసీ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకూ ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ చేయాలని అధికారులకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలు జరగగా.. ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం సరికాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను ఈసీ వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.