తనకు ఎవరైనా ఇలా చేయాలి, అలా చెయ్‌మని చెబితే పెద్దగా నచ్చదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తనకే స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తే మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తాను ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొనడంలో కాస్త తడబాటుకు గురయ్యానని, ఆ సమయంలో అప్పటి కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు ఇచ్చాడని పంత్ పేర్కొన్నాడు. పంత్ చివరిసారిగా 2022లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపుగా 18 నెలలు ఆటకు దూరమై కోలుకొని టీ20 ప్రపంచకప్ 2024లో ఆడాడు.
ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2024లో రిషబ్ పంత్ ఆడుతున్నాడు. ఇండియా-బికి ఆడుతున్న పంత్.. ఇండియా-ఎపై అర్ధ శతకం చేశాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ జట్టును ప్రకటించగా.. అందులో చోటు దక్కించుకుని సుదీర్ఘ ఫార్మాట్‌లోకి పునరాగమనం చేశాడు. బంగ్లాదేశ్ సిరీస్ అనంతరం జరిగే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో కీలకంగా మారతాడని అందరూ భావిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ దక్కించుకోవడంలో పంత్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
‘మాజీ కోచ్ రవిశాస్త్రితో నాకు మంచి అనుబంధం ఉంది. మైదానంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అలా చెయ్, ఇలా చెయ్‌మని చెబితే నాకు నచ్చదు. నాకే ఆడే అవకాశం ఇస్తే మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఆస్ట్రేలియా పర్యటనలో నేను ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొనడంలో తడబడ్డాను. ఆ సమయంలో రవిశాస్త్రి న వద్దకు వచ్చి.. ఆఫ్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నావని అడిగాడు. నేను కూడా వారిలా ఆడితే బాగుంటుందని చెప్పా. నువ్వు రివర్స్ స్వీప్ ఆడు, ఆఫ్ స్పిన్నర్లను అడ్డుకోవడానికి ఇదొక అస్త్రం,. టెస్టు క్రికెట్‌లో నీకు పనికొస్తుందని సూచించాడు. అప్పట్నుంచి ఎక్కువగా రివర్స్ స్వీప్ ఆడాను’ అని పంత్ చెప్పాడు.