Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ దిగుమతి టారిఫ్‌ల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశానికి కాస్త భారీగానే ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశముంది. ట్రంప్ తాజాగా కాపర్‌పై 50 శాతం దిగుమతి టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించగా.. ప్రజల మందులపై 200 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజాగా.. ఈ రోజు కాపర్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాం. దీని మీద టారిఫ్ 50 శాతం ఉండేలా చేస్తాం అని ట్రంప్ క్యాబినెట్ సమావేశంలో వెల్లడించారు. ఆయన ప్రకటన అనంతరం కాపర్ ధరలు భారీగా పెరిగాయి. ఇక ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకారం.. ఈ కొత్త టారిఫ్ జూలై చివర లేదా ఆగస్టు 1న అమల్లోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also:Haj Yatra 2026: త్వరపడండి.. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. అప్పటి వరకే ఛాన్స్..!
అంతేకాకుండా, అమెరికా దిగుమతులపై పరిశీలనల క్రమంలో ఔషధాలు, సెమీకండక్టర్లు, లాంబర్, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాలపై భవిష్యత్తులో మరింత టారిఫ్‌లు విధించే అవకాశముందని సూచించారు. ఒక సంవత్సరం లోపల ఉత్పత్తిదారులు తమ కార్యకలాపాలను అమెరికాలోకి తరలించాలి. తర్వాత వారిపై 200 శాతం టారిఫ్‌లు అమలవుతాయని ట్రంప్ హెచ్చరించారు.
ఇక భారత్ కాపర్ దిగుమతుల్లో అమెరికా మూడో అతిపెద్ద మార్కెట్. 2024–25లో భారత్ మొత్తం 2 బిలియన్ డాలర్స్ విలువైన కాపర్, దాని ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. అమెరికాకు చేసిన ఎగుమతులు 360 మిలియన్ల డాలర్స్ గా ఉన్నాయి. అయితే కాపర్ వాడకం ఎనర్జీ, మానుఫ్యాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో విస్తృతంగా ఉండటంతో, అమెరికాలో డిమాండ్ తగ్గినా.. దీన్ని దేశీయ పరిశ్రమ తట్టుకునే అవకాశముంది.
కానీ, అసలు ప్రభావం ఔషధ రంగంపై ఉంటుంది. అమెరికా భారత్‌కు అతిపెద్ద ఔషధ ఎగుమతి గమ్యం. FY25లో అమెరికాకు ఔషధ ఎగుమతులు 9.8 బిలియన్ డాలర్స్ గా ఉంది. గతేడాది (FY24) తో పోలిస్తే ఇది 21% వృద్ధి. ఇది భారత మొత్తం ఔషధ ఎగుమతుల్లో 40%. ఒకవేళ వీటిపై 200 శాతం టారిఫ్ విధిస్తే, భారత జనరిక్ ఔషధ పరిశ్రమపై భారీ ప్రభావం ఉండనుంది. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ఒక చిన్న స్థాయి వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉంది. ఈ ఒప్పందంలో వివిధ రంగాల టారిఫ్‌లపై చర్చ జరుగుతోంది. ఆగస్టు 1 నాటికి ఒప్పందం పూర్తి అయితే, కొత్తగా విధించబోయే టారిఫ్‌లు భారత మార్కెట్లను ప్రభావితం చేయకుండా ఉండే అవకాశం ఉంది.