Telangana Elections: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలింగ్ బూత్ ఎదుటే ధర్నాకు దిగారు. పలు పోలింగ్ కేంద్రాల్లోకి స్థానికేతరుడైన రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. ఈ నెల 28 నుంచి స్థానికేతరులు స్థానికంగా ఉండరాదన్న నిబంధనను ఆయన ఉల్లంఘించి.. కొండల్ రెడ్డి నేరుగా పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.
మున్సిపల్ ఆఫీసులోని పోలింగ్ బూత్ తో పాటు బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ వద్దకు వెళ్లడంపై కామారెడ్డి బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎన్నికల నియమావళి ఉండదా అని ప్రశ్నించారు. కొండల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక కౌన్సిలర్లతో పాటు బీఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నల్ల కార్ల కాన్వాయ్‌తో పోలింగ్ బూతుల్లో హల్‌చల్ చేస్తున్నా చోద్యం చూస్తున్న ఎలక్షన్ అధికారులు, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. కొండలరెడ్డి పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు.