Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఏళ్లుగా పెండింగ్‌లోఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లకు అప్పగిస్తారు. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలి. అయితే కొన్ని సీజన్లుగా మిల్లర్లు సీఎంఆర్ అప్పగించకుండా పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది వానాకాలంలో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు, బియ్యం తిరిగి ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారు. ఇటీవల జిల్లాలో హైదరాబాద్ సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో మిల్లర్ల బాగోతాలు బయటపడ్డాయి. కొన్ని మిల్లులు గడువు కావాలంటూ కోర్టును ఆశ్రయించాయి.
Read Also: Gandipet Gates: గండిపేట జలాశయానికి భారీగా వరద ప్రవాహం.. 6 గేట్లు ఎత్తివేత
ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు.సీఎంఆర్‌లో ధాన్యం అవకతవకలు చేసిన మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు కారకులైన వారు ఎంతటి వారు అయినా కఠినంగా శిక్షిస్తామన.. బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. మిల్లులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో వంద కోట్ల మేరకు సీఎంఆర్ ధాన్యంలో అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. మిల్లులకు ఇచ్చిన ధాన్యం ప్రభుత్వ, ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. సీఎంఆర్ అవకతవకలకు ఎవ్వరు పాల్పడినా సహించేది లేదన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరణ మిల్లులకు తరలింపు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చుతామన్నారు. ఖమ్మం జిల్లాలో మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావలసిన బియ్యంను వెంటనే రాబడుతామన్నారు. బియ్యం ఇవ్వని మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు.