Bhatti Vikramarka: తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ఏమీ మార్చలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనేక పార్టీలు అనేక ప్రతిరూపాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవం చేసుకుందామంటూ ప్రజలకు తెలిపారు. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలోఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగించారు.
Read Also: Telangana Thalli Statue: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
నిధులు, నీళ్లు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ అని.. తెలంగాణ అంతా ఇప్పుడు భావస్వేచ్ఛ కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించామన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పులపాలు చేసిందని.. రూ.7 లక్షల కోట్ల అప్పును బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగిల్చిందని డిప్యూటీ సీఎం అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులకు మేము రూ.64 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామన్నారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఆర్థికస్థితిని గాడిలో పెడుతున్నామని ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామన్నారు. అనేక ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.