ఓ వైపు ఎండలు.. ఇంకోవైపు విద్యుత్ సంక్షోభం.. దానికి తోడు తాగునీటి కష్టాలు.. ఇవన్నీ ఒకేసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వేధిస్తోంది. కనీస అవసరాలకు నీళ్లు లభించక హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్యాంకర్ల మాఫీయాగా ఏర్పడి.. జనాలను పీడించుకుని తింటున్నారు. అధికారులు చర్యలు చేపట్టినా అత్యధిక ధరల్లో విక్రయిస్తున్నారు. ఇక ట్యాంకర్లు కాలనీలకు రాగానే.. ప్రజలు ఎగబడి పట్టుకుంటున్నారు. ఇలా తాగునీటి కష్టాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఏర్పడిన నీటి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో నీళ్లు విడుదల చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ సర్కార్ కోరింది. యమునా నదికి అదనపు నీటిని విడుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం హర్యానాకు విజ్ఞప్తి చేసిందని మంత్రి అతిషి శనివారం తెలిపారు. మునక్ కాలువ, వజీరాబాద్ రిజర్వాయర్‌లో ముడి నీటి కొరత కారణంగా రాజధాని ఉత్పత్తిలో రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల కొరతను ఎదుర్కొంటోందని వెల్లడించారు. ముడి నీటి కొరత కారణంగా ఢిల్లీలో దాదాపు 1,002 ఎంజీడీల సాధారణ నీటి ఉత్పత్తి శుక్రవారం నాటికి 932 ఎంజీడీలకు పడిపోయిందని ఆమె తెలిపారు. శుక్రవారం జరిగిన ఎగువ యమునా రివర్ బోర్డు సమావేశంలో ఢిల్లీలో నీటి సంక్షోభానికి పరిష్కారం లభించలేదని ఆమె అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఉపయోగించని నీటిని ఢిల్లీకి అందించేందుకు సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తాను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడానని.. సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Seethakka:మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల రుణాలు..మంత్రి సీతక్క వెల్లడి
శనివారం ఢిల్లీ జల్‌బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో నీరు అందని ప్రాంతాలను అంచనా వేయాలని, నీటి ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో DJB ట్యాంకర్లు రోజుకు 10 MGD నీటిని సరఫరా చేస్తున్నాయని వివరించారు. సుమారు 10,000 ట్రిప్పులు చేస్తున్నాయన్నారు. బవానా, ద్వారకా, నాంగ్లోయ్ వంటి కొన్ని ఇతర ప్రాంతాల్లో స్థానిక నివాసితులకు నీటిని అందించడానికి అత్యవసర గొట్టపు బావులను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు.
ఇది కూడా చదవండి: Pushpa 2 : పుష్ప 2 తప్పుకోవడంతో పోటీలోకి వచ్చిన ఆ రెండు సినిమాలు..?