December 2 Significance: దేశంలో అద్దె ఒప్పందాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై ఇంటి యజమానులు రెంట్ పెంచాలంటే కనీసం 90 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సిందే అని ఈ నిబంధనలు స్పష్టం చేశాయి. అదే విధంగా అద్దె పెంపు విషయంలో కూడా ఇకపై నిబంధనలు పాటించాల్సిందే అని, భద్రతా డిపాజిట్ కూడా ఇక నుంచి గరిష్టంగా రెండు నెలల అద్దె మాత్రమే వసూలు చేయాలని వెల్లడించాయి. ఇక నుంచి అద్దె ఒప్పందాలను ఆన్లైన్లో 60 రోజుల్లోపు రిజిస్టర్ చేయించడం తప్పనిసరి చేశారు. కేంద్రం తాజాగా అమలులోకి తీసుకొచ్చిన ఈ నిబంధనలతో దేశవ్యాప్తంగా లక్షలాది అద్దెదారులకు భారీ ఉపశమనం కలుగనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Nadendla Manohar : సమస్యలపై రైతులు నేరుగా 1967కు కాల్ చేయొచ్చు
డిసెంబర్ 2న తేదీ దేశం మరోసారి 1984 భోపాల్ విషవాయు చేదు సంఘటనను జ్ఞాపకం చేసుకుంటోంది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి లీక్ అయిన మిథైల్ ఐసోసైనేట్ వాయువు ఒక్క రాత్రిలోనే వేలాది మంది ప్రాణాలు తీసింది. ఈ సంఘటన ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ దుర్ఘటనకు 41వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజును జాతీయ కాలుష్య నియంత్రణ దినంగా పాటిస్తున్నారు. అలాగే కార్మిక రంగంలోనూ ఈ రోజు ప్రాధాన్యత సంతరించింది. 29 పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త కార్మిక కోడ్లు అమలులోకి వచ్చాయి. గిగ్ వర్కర్లు, మహిళా ఉద్యోగులు, ఐటీ రంగ ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ, స్థిరమైన పనిగంటలు, న్యాయమైన వేతనాలు, భద్రతా ప్రమాణాలు ఈ కొత్త చట్టాల్లో కీలకాంశాలుగా నిలిచాయి.
అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలతో సేఫ్ హెవెన్ ఆస్తిగా బంగారం పైపైకి దూసుకుపోతుంది. నిపుణుల అంచనా ప్రకారం 2026 నాటికి ఒక ఔన్స్ బంగారం ధర ఐదు వేల డాలర్లు దాటే అవకాశం ఉందని అంచనా. ఇక నుంచి విమానయాన రంగంలో ప్రయాణికులకు షాక్ తగులే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల అభివృద్ధి రుసుము విషయంలో టెలికాం డిస్ప్యూట్ రెజ్యూలేషన్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (TDSAT) ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఎయిర్‌లైన్స్ రూ.50 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని భరించలేకపోతే టికెట్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికాలో గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూల సందర్భంగా వీసా ఓవర్‌స్టే ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అమెరికన్ పౌరులతో వివాహ బంధం ఉన్నప్పటికీ ఈ చర్యల నుంచి మినహాయింపు లభించడం లేదని సమాచారం. ఒక్క రోజులో దేశీయ, అంతర్జాతీయ రంగాల్లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూనే భవిష్యత్తు కోసం కొత్త అడుగులు వేస్తున్న ఈ డిసెంబర్ 2… నిజంగా చరిత్రలో మరచిపోలేని రోజుగా నిలిచిపోనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Hardik Pandya: రీఎంట్రీతో అదరహో అనిపించిన ఆల్‌రౌండర్..