Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్‌గా మారింది. దానికి రేమాల్‌గా నామకరణం చేశారు. రేమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం చూపనుంది. ఏపీపై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించిందియ. ఉత్తర బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ కొనసాగుతోంది.
Read Also: Delhi: బేబీ కేర్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు నవజాత శిశువులు దహనం
మరోవైపు నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీపై తుఫాన్ ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విజయవాడలోని పలు రహదారులపై వాననీరు నిలిచిపోయింది.