మొంథా తుఫాన్ తీరం దాటిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ని తాకుతున్నాయి. రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురు గాలులు వర్షం కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై పడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నారు. పల్లిపాలెం గ్రామం జలమయం కావడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు నిన్న సాయంత్రం నుంచి నిలిపివేశారు.
అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో ఏటిగట్లు ప్రమాదకరంగా మారాయి. భోగాపురం సమీపంలో ఉడేరు నదికి వరద తాకిడి ఎక్కువైంది. భోగాపురం, చాకిపల్లి కట్టు వద్ద గట్లు కోతకు గురవుతున్నాయి. గండిపడితే 500 ఎకరాలకు పైగా భూములు పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో వరిపైర్లు దెబ్బతిన్నాయి. కంకుల దశకు వచ్చిన సమయంలో కురిసిన వర్షాలతో వరి నేలవాలింది. వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంట మరింత దెబ్బతింది.
Also Read: AUS vs IND: నేడే ఆస్ట్రేలియా, భారత్ మొదటి టీ20.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్ డీటెయిల్స్ ఇవే!
విజయవాడలో కురుస్తున్న భారీ వర్షానికి వీఎంసీ అధికారులు క్షేత్రస్ధాయిలో చర్యలు మొదలుపెట్టారు. కాలువలు క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఉదయం 5 గంటల నుంచి పని చేస్తున్నా.. ఇంకా వాన తగ్గితే తప్ప పరిస్దితులు చక్కబడే పరిస్ధితి లేదంటున్నారు. ఇక మొంథా తుఫాన్ తీరం దాటిన తర్వాత తాజా పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికారులు పంట నష్టం, ఇతర అంశాలపై దృష్టి పెట్టనున్నారు. సీఎం చంద్రబాబు వాతావరణ పరిస్థితి బట్టి అంబేద్కర్ కోనసీమ పర్యటన ఉండే అవకాశం ఉంది.