‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈరోజు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముంది. మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాన్ ప్రభావం ఇప్పటికే కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం పూర్తిగా మారింది. భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో నెల్లూరులోని ఉదయగిరి-కావలి ప్రాంతాలలో తేలికపాటి వర్షం మొదలైంది. తుమ్మలపెంట సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి.
మొంథా తుపాను ప్రభావంతో విశాఖలోని విద్యాసంస్థలు, పర్యాటక కేంద్రాలను అధికారులు క్లోజ్ చేశారు. ఋషికొండ, సాగర్ నగర్ బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు తీరప్రాంతానికి రావొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులు, సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పాటు కైలాసగిరి సహా బీచ్ రోడ్డులో ఉన్న సందర్శన స్థలాలను VMRDA మూసివేసింది. ఈనెల 29 వరకు కైలాసగిరిపై కేబుల్ కార్, అడ్వంచేర్ స్పోర్ట్స్ నిలిపివేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి కైలాసగిరి చూసేందుకు వస్తున్న పర్యాటకులను సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.
Also Read: Cyclone Montha: కాకినాడలో మొదలైన మొంథా తుపాన్ ప్రభావం.. ఒక్కసారిగా మారిన వాతావరణం!
నేటి నుంచి మూడు రోజుల పాటు విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, గుంటూరు, కాకినాడ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో కాకినాడలో రైతు బజార్లు రద్దీగా మారాయి. తుపాన్ సమయంలో కూరగాయలు దొరుకుతాయో లేదో అని జనాలు అప్రమత్తమయ్యారు. వారం రోజులకు సరిపడా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా వ్యాపారాలు బిజీ బిజీగా ఉన్నారు.