Heavy Crop damage in AP: మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాలనీలు జలమయంగా మారాయి. గోరింకల డ్రైన్ పొంగి పొర్లుతోంది. వర్షాలకు వరి చేలు మొత్తం నేలకొరిగాయి. చేతికి అందివచ్చిన పంటలు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లితో పాటు అనేక మండలాలలో వరి చేలు దెబ్బతిన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు.
మిచాంగ్ తుఫాన్ గుంటూరు, బాపట్ల జిల్లాలో తీవ్ర పంట నష్టాన్ని మిగిల్చింది. తీర ప్రాంతంతో పాటు గుంటూరు జిల్లాలో వర్షం భారీగా కురిసింది. అత్యధికంగా మేడికొండూరు మండలంలో 133 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. మేడికొండూరు,పెదనందిపాడు, ప్రత్తిపాడు, ఫిరంగిపురం మండలాల్లో భారీ వర్షం పడింది. దాంతో పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగిపోయాయి. పెదనందిపాడు, పెద్దకాకాని, కాకుమాను తదితర ప్రాంతాల్లో రైతులకు భారీ నష్టాలు వాటిల్లాయి. వట్టిచెరుకూరు కాకుమాను మండలాల్లో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వాటర్ ప్లాంట్స్ పనిచేయక తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: MI Captain: రోహిత్, హార్దిక్ వద్దు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడే ‘సరైనోడు’!
మిచాంగ్ తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. అత్యధికంగా 1.69 లక్షల ఎకరాల్లో వరి పంట పాడైంది. భారీ వర్షంతో ధాన్యం తడిచిముద్దయింది. 2257 ఎకరాల్లో వేరుశనగ, 1457 ఎకరాల్లో మినప, 530 ఎకరాల్లో పత్తి, 405 ఎకరాలు మొక్కజొన్న పంట నష్టం వాటిల్లింది. 707 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. 62 హెక్టార్లలో అరటి తోటలు నష్టం అయినట్టు ప్రాథమిక సమాచారం.