సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం ఉత్తరపల్లిలో యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిన్న దారుణ హత్యకు గురైన రాజు (35) హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. భర్తని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. విచారణలో ఏమీ తెలియనట్టు అమాయకత్వం ప్రదర్శించిన భార్య సుమలతను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం… సుమలత 12 ఏళ్ల క్రితం రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుమలతపై ప్రేమతో రాజు తన ఛాతీ ఎడమ వైపు లత అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. రాజు, సుమలతకి ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ కుటుంబ సభ్యులకు దూరంగా వచ్చి జీవిస్తున్నారు. మల్లెపల్లిలోని ఓ బీర్ ఫ్యాక్టరీ క్యాంటీన్లో భార్యాభర్తలు పని చేస్తున్నారు. క్యాంటీన్లో వంట మాస్టర్‌తో సుమలత ప్రేమలో పడింది. మాస్టర్ మాయలో పడిన సుమలత భర్తని పక్కకుపెట్టింది. దాంతో గత కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
మాస్టర్‌తో ప్రేమ మత్తులో ఉన్న సుమలత.. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించేందుకు పథకం పన్నింది. సుమలత ప్రియుడు మందు తాగుదామని రాజును పిలిచాడు. రాజు పూటుగా మద్యం సేవించాక.. అతడిని హత్య చేశాడు. అనంతరం తన భర్త హత్యకు గురయ్యాడని నాటకం ఆడింది. భర్తని హత్య చేసి ఏమి తెలియనట్టు సతి సావిత్రిలా నటించింది. విచారణలో పోలీసులు అసలు సినిమా చూపించడంతో అసలు స్టోరీ చెప్పింది.