న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్‌పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు, హెవీ వెహికిల్స్‌ను అనుమతిస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయని, పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తప్పని రాచకొండ సీపీ హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ… ‘ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం. 129 ఫాంహౌస్‌లు, 6 పబ్‌లు, 180 వరకు హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే వారికి అవసరమైన హెచ్చరికలు జారీ చేశాము. మహిళలకు అగౌరవం జరగకుండా చూడాలంటూ ఈవెంట్ నిర్వాహకులకు చెప్పాము. షీటీమ్స్ ఉంటాయి. మాజీ ప్రధాని మన్మోహన్ చనిపోయారు. సంతాపం దినాలు ఉన్నాయి కాబట్టి మా డిపార్ట్మెంట్ తరుపున ఎలాంటి కేక్ కటింగ్స్ ఉండవు. ఈ రోజు కొన్ని చిన్నచిన్న కేసుల్లో గంజాయి, పాపిస్ట్రా డ్రగ్ పట్టుకున్నాం. ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తాము’ అని తెలిపారు.
‘స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేశాం. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతారు. పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తప్పవు. మద్యం సేవించిన వారికి పబ్‌లు, బార్ల యాజమానులు ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని చెప్పాము’ అని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని సూచించారు.