ప్రధాని నరేంద్ర మోడీ కనికరంలేని రాజకీయ నాయకుడు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు తెలంగాణ వచ్చారా? లేదా రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చారా? అని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్నగా కొనియాడితే.. మోడీ మాత్రం పార్టీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా? లేదా? ఎన్నికల ముందే చెప్పాలని, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కూనంనేని డిమాండ్ చేశారు.
కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ… ‘కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య రోజు రోజుకు క్లిష్టంగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఏమీ మాట్లాడాలో అర్థంకాక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారు. నిపుణుల కమిటీ నివేదికను నెల రోజుల్లో ఇవ్వాలి. బీఆర్‌ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే నిపుణుల కమిటీ నివేదికను త్వరితగతిన ఇవ్వాలని కోరాలి. బీజేపీ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలని ఉవ్విల్లారుతుంది. ప్రతి ఎన్నికల ముందు ప్రధాని రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తారు. నరేంద్ర మోడీ కనికరంలేని రాజకీయ నాయకుడు. ప్రధాని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఇటీవల తెలంగాణ వచ్చారా? లేదా రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చారా?. అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్నగా కొనియాడితే.. మోడీ మాత్రం పార్టీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు’ అని మండిపడ్డారు.
Also Read: Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం.. మహిళ గొంతుకోసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు!
‘పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా? లేదా? అన్నది ఎన్నికల ముందే చెప్పాలి. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. రాష్ట్రంలో నీటి ఎద్దడి పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. బీఆర్‌ఎస్-బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం వాళ్ల వ్యక్తిగత విషయం. బీఆర్‌ఎస్ పార్టీలో మొన్నటికి, ఇవాళ్టికీ ఏ మార్పు వచ్చిందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాలి. ప్రవీణ్ బీఆర్‌ఎస్ పార్టీతో కలవడం దురదృష్టకరం. ఐదు పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్‌కు ప్రతిపాదన పెట్టాం. ఐదింటిలో కనీసం ఒక సీటు అయినా సీపీఐకి ఇచ్చి కాంగ్రెస్ మిత్ర ధర్మం పాటించాలి. వయనాడ్‌లో రాహుల్ గాంధీ పోటీ చేయకపోవడం మంచిది. రాహుల్ సీపీఐ అభ్యర్థిపైనే విజయం సాధించారు. వయనాడ్ సీపీఐ సీటు, రాహుల్ గాంధీ మిత్ర ధర్మం పాటించాలి’ అని కూనంనేని అన్నారు.