జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించడం విచారకరం అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థను బద్దలు కొట్టే 370 ఆర్టికల్ ను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం ప్రమాదకర చర్య అని అన్నారు. సుప్రీం కోర్టు సమర్ధించడం అంటే బీజేపీ దుష్ట విధానాన్ని సమర్ధించడమే అవుతుందని ఆయన చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేక చర్య మాత్రమే గాక జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీల ఉల్లంఘన అని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు చేయడం లౌకిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే.. సుప్రీంకోర్టు అయినా దీనిని కాపాడుతుందని అనుకున్నాను.. కోర్టు కూడా కాపాడలేకపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దేశ సమగ్రతను కాపాడడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా పేర్కొన్నారు. ఆర్టికల్ 370 నీ కాపాడి దేశ సమగ్రత, సమైక్యత లౌకిక వ్యవస్థను కాపాడాలని కోరారు.