సీపీఐ నేత నారాయణ హెచ్‌సీయూ భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో హెచ్‌సీయూ కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ భూములపై పడిందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు విద్యా వ్యవస్థకే కేటాయించినవని తాము స్పష్టంగా చెప్పామని నారాయణ గుర్తు చేశారు. విద్య కోసం కేటాయించిన భూములు అదే ప్రయోజనానికి ఉపయోగించాలే తప్ప, వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదని హెచ్చరించారు. జనాభా పెరుగుతుందని, కానీ భూమి పెరగదని, అందుకే ప్రభుత్వ భూములను అమ్మకూడదని నారాయణ పేర్కొన్నారు.
READ MORE: Pharmacist Death: పార్మసిస్ట్ నాగాంజలి మృతి.. నిందితుడు దీపక్‌పై హత్య కేసు నమోదు చేస్తాం: డీఎస్పీ
గత ప్రభుత్వాలు భూములు అమ్మాయని, అయితే ఇప్పుడు వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నారని ఆయన తెలిపారు. చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఈ భూములు వచ్చాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్‌సీయూ భూముల విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ భూముల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, యూనివర్సిటీ భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దని నారాయణ స్పష్టం చేశారు. విద్యార్థులను కొడుతూనే, భూములు అమ్మే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయాలు, వ్యక్తిగత మిత్రబంధాలు వేరు, కానీ ప్రస్తుత సమస్య వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కారని నారాయణ వ్యాఖ్యానించారు.
READ MORE: NANI : హిట్ 3 లీక్స్.. శైలేష్ ఎమోషనల్ పోస్ట్
వక్ఫ్ బిల్లుపై కూడా నారాయణ విమర్శలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో లౌకిక వ్యవస్థకు చీకటి రోజులు వచ్చాయని అన్నారు. రెండు సభలను బుల్డోజ్ చేశారని, రాజ్యాంగానికి విలువ లేకుండా పోయిందని అన్నారు. దీని వల్ల మతపర ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదని, లౌకిక వ్యవస్థను పాడు చేసే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదమైనా, తమ ఆందోళనలు బయట కొనసాగుతాయని నారాయణ స్పష్టం చేశారు.